THINGS THAT THE FAMILY SHOULD DO TO HELP A STROKE PATIENT
పక్షవాతం/వాగ్బంధనం ఉన్నవారి కుటుంబ సభ్యుల పాత్ర
- బాధితుడ్ని / బాధితురాల్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం కోసం వీలైనంత సమాచారాన్ని సేకరించడం.
- రోగి తనంతట తాను చేయలేని పనులను గురించి విచారించకండి. అవి - ఆయన / ఆమె ఆశక్తులని గ్రహించండి.
- రోగి నిరంతరము నరాల సంబంధిత వ్యాధులను పరీక్షించే నిపుణులు లేదా వైద్యులు సలహాలు తీసుకుంటూ ఉండాలి. మీ ఊరిలో అటువంటి స్పెషలిస్ట్ లేకపొతే, దగ్గరలో ఉన్న జిల్లా లేదా పట్టణ ఆసుపత్రికి వెళ్లి అక్కడ లబించే చికిత్సల గురించి విచారించండి.
- పక్షవాతం /వాగ్బంధనం వచ్చిన వెంటనే, డాక్టర్ని (Neurologist/Physio/Occupational/Speech therapist) సంప్రదించండి.
- రోగి ఇతరులతో మాట్లాడడానికి వీలైనన్ని అవకాశాలు కల్పించిండి. సంఖ్యలు లెక్కించడం, వారాల, దినాల పేర్లు, సంవత్సరంలో నెలల పేర్లు, మర్యాద వెలిబుచ్చడానికి ఉపయోగించు పద సముదాయాలు (బాగున్నార? కూర్చొండి, వెళ్లి వస్తాను, భోంచేస్తార మొదలైనవి) చెప్పించండి. ఇవి స్వయం చాలక అనుక్రియలు కాబట్టి రోగి సులభంగా చెప్పగలరు.
- రోగి మాట్లాడడానికి చేసిన ప్రయత్నాలు అవి ఎంత చిన్న ప్రయత్నాలైనా ఆనందం వెల్లిబుచ్చండి.
- వైద్యుల సలహాల మేరకు రోగి కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనేటట్లు చూడండి.
- రోగి ఒక దినచర్య అవలంభించేటట్లు చూడండి. దీని ద్వారా రోగికి అభద్రత ఉండదు. తన శక్తి మీద నమ్మకం కల్గుతుంది.
- దినచర్యలో తగినన్ని విశ్రాంతి వేళలు ఉండేటట్లు చూడాలి. విశ్రాంతి ముగిసిన తదుపరి, కుటుంబ సభ్యులు రోగికి మాటల శిక్షణ ఇవ్వచ్చు.
- రోగి వయస్సులో పెద్ద అని గుర్తు పెట్టుకోవాలి. మెదడు దెబ్బతినక ముందు ఆయనికి ఇంట్లో ఎంత గౌరవం ఇచ్చే వారో ఇప్పుడూ అంతే గౌరవం ఇవ్వడం, ముఖ్య విషయాల్లో ఆయన సలహాలు తీసుకోవడం చెయ్యాలి.
- రోగి యొక్క అవసరాలను గుర్తించండి. కొంతమందికి తమ బంధువుల్ని, స్నేహితుల్ని, కలవాలని అనిపించకపోవచ్చు. వాగ్బంధనం మూలంగా కలిగిన మార్పులకి అలవాటు పడినంతకాలం వారు ఇతరులని కలవడానికి ఇష్ట పడకపోవచ్చు. వాళ్ళ ఇష్టాయిష్టాలను గౌరవించి నిదానంగా బయట వ్యక్తులను పరిచయం చేయండి.
- కొంతమంది రోగులు పిచ్చి తిట్లు తిట్టవచ్చు. తిట్ట వద్దని చెప్పినా అలా చేయకుండా ఉండలేకపోవచ్చు. ఈ విషయం గురించి బాధపడడం, కోపం తెచ్చుకోవడం, నవ్వడం మంచిది కాదు.
- ఉన్నట్టుండి అకారణంగా రోగి ఏడవడం చేస్తే, కొంతసేపు పట్టించుకోకుండా వదిలేయవచ్చు. ఆయన నిమగ్నమై ఉన్న పనిని మార్చడం, మీరు చేసే పని చేసుకుంటూ పోవడం చెయ్యండి.

